దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని లిజ్

britain-pm-liz-truss-apologizes-after-tax-cut-decision-u-turn

లండన్: దేశ ప్రజలకు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్క్ష క్షమాపణలు చెప్పారు. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని ప్రధాని ఎన్నికల సమయంలో చెప్పిన ఆమె.. చెప్పినట్లే ప్రధాని అయిన తర్వాత పన్నులు తగ్గించారు. అయితే ఇలా చేయడం వల్ల బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్‌ను ఆమె పదవి నుంచి తప్పించారు. ఈ పదవిలోకి జెరెమీ హంట్ వచ్చారు.

వచ్చీరావడంతోనే గత నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన తోసిపుచ్చారు. పన్నులు తగ్గించడం వల్ల ప్రభుత్వంపై భారం పడుతోందంటూ.. పన్ను తగ్గింపులను తొలగించారు. ఈ సందర్భంగా లిజ్ మాట్లాడుతూ.. ‘జరిగిన తప్పులకు బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మేం మరీ వేగంగా చాలా దూరం పరిగెత్తాం’ అని అన్నారు.

అదే సమయంలో దేశానికి సేవ చేయాలని తను ధృడ సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. పన్ను రేట్ల విషయంలో యూటర్న్ తీసుకోవడంతో ప్రభుత్వంలో ఆమె ప్రాముఖ్యత పడిపోయిందని, త్వరలోనే పదవి నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జెరెమీ హంట్ ప్రధాని బాధ్యతలు కూడా స్వీకరిస్తారని గుసగుసలు వినిపించాయి. వీటిపై తేల్చేసిన లిజ్ ట్రస్.. తాను బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతనని స్పష్టం చేశారు.