బొత్స మేనల్లుడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ ..

విశాఖపట్టణంలోని నమ్మివానిపేటకు చెందిన విద్యుత్ లైన్‌మేన్ ఎం.బంగార్రాజు దారుణహత్య వెనక మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు హస్తం ఉన్నట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టారు. ఆనందపురం మండలం గొట్టిపల్లిలో బంగార్రాజు విద్యుత్ లైన్​మన్​గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. గత ఆదివారం సాయంత్రం నుంచి బంగార్రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు భీమునిపట్నం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం ఏనుగులపాలెం పంటపొలాల్లో బంగార్రాజు మృతదేహం లభ్యమైంది.

మృతుడు తన భార్య, పిల్లలతో తగరపువలస సమీపంలో నమ్మివానిపేటలో నివాసం ఉంటున్నారు. బంగార్రాజు మృతి మిస్టరీగా మారడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే డబ్బులిస్తామని పిలిపించి అత్యంత కిరాతకంగా చంపేశారంటూ బంగార్రాజు భార్య నందిని ఆరోపించారు. కాగా మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణకుమార్‌ అతిథి గృహం వద్ద సంఘటన జరగడం, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోవింద్‌తో ఆయనకు పరిచయాలుండడంతో లక్ష్మణకుమార్‌ను కూడా నిందితుడిగా చూపాలంటూ మృతుడి భార్య, బంధువులు శుక్రవారం పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఫోను చేసి బంగార్రాజు కుటుంబీకులతో మాట్లాడారు. అయినా లక్ష్మణరావు అరెస్టు తర్వాతే శవపరీక్షకు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అంతకుముందు పోలీసులు కూడా చర్చించినా అదే విషయం స్పష్టం చేశారు. తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు శుక్రవారం కలెక్టర్‌ మల్లికార్జునను కలిశారు. అయినా న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా కలెక్టరేట్‌ ముట్టడికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు.