ధన్ ఖడ్, కిరణ్ రిజిజు పై సుప్రీంలో పిటిషన్

న్యాయ వ్యవస్థను కించపరిచారంటూ అభియోగం

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ న్యాయ వ్యవస్థ ఔన్నత్యానికి భంగం కలిగేలా మాట్లాడారని, వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని బాంబే లాయర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును కూడా పదవి నుంచి తప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదంటూ కేంద్ర మంత్రి రిజిజు బహిరంగంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టింది. ఇది సుప్రీంకోర్టును అవమానించడమేనని విమర్శించింది.

రాజ్యాంగబద్ధమైన కీలక పదవిలో ఉండి సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును తప్పుపట్టారంటూ ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ పై బాంబే లాయర్ల సంఘం ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదంటూ 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధన్ ఖడ్ తప్పుబట్టారని విమర్శించింది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రి రిజిజును పదవి నుంచి తప్పించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎ.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది.