పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగార జలపాతం..

తెలంగాణ నయాగార జలపాతంగా పిలువబడే బొగత జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం పరుగులుపెడుతుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. జలపాతం అందాలను తిలకిస్తూ సెల్ ఫోన్ లో బొగత జలపాతం ఫోటోలను చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా.. ఆంధ్ర రాష్ట్రం, ఛతీస్ గడ్ రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఆనందం పొందుతున్నారు. బొగత జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు బహుత లోయలో జలకాలాడుతూ తల స్నానాలు చేస్తున్నారు. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి బొగత పర్యాటక కేంద్రం వద్ద సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉన్నది.