బీజేపీకి అహంకారం పెరిగింది – కేసీఆర్

బిజెపి పార్టీకి అహంకారం బాగా పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ అహంకారాన్ని దించే రోజులు దగ్గరపడ్డాయి అని హెచ్చరించారు. ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్…మోడీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలైపై విమర్శలు గుప్పించారు. ఏక్‌నాథ్ షిండేను తీసుకువస్తామంటూ నెత్తిమాసినోడు అంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో మిత్రపక్షంతో కలిసి 110 స్థానాలున్నాయని చెప్పారు. బీజేపీవారు షిండేల సృష్టికర్తలా అని విమర్శించారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వాలను కూల్చుతారా? అని ప్రశ్నించారు.

శ్రీలంకలో ప్రాజెక్టు ఒకటి ఆయన స్నేహితుడికే ఇచ్చారు. భారత ప్రభుత్వం నామినేట్‌ చేసిందని, మోడీ ఒత్తిడి వల్లే ప్రాజెక్టు ఇచ్చామని అక్కడి అధికారులు చెప్పారు. చరిత్రలో ఏ ప్రధాని ఆ విధంగా నామినేట్‌ చేయలేదు. భారత ప్రధాని పట్ల శ్రీలంకలో నిరసనలు తెలుపుతున్నారు. భారతదేశంలో కురిసే వర్ష పాతం లక్షా 40వేల టీఎంసీలు. నదుల నుంచి మనం తీసుకునే అవకాశమున్న నీరు 70వేల టీఎంసీలు.. ఇందులో మనం తీసుకుంటున్నది కేవలం 22వేల టీఎంసీలు మాత్రమే. 6వేల టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్‌ జింబాబ్వేలో ఉంది. భారతదేశ భూమి విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అడ్వాంటేజ్‌ భారత్‌కు ఉంది. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. కేంద్రం అసమర్థ విధానాల కారణంగా పిచ్చి ముఖాలు వేసుకుని మెక్‌ డొనాల్డ్‌ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. దేశంలో 52శాతం యువత ఉంది. ప్రగతి బాట పట్టాల్సిన యువతను పక్కదారి పట్టిస్తున్నారు. గుణాత్మక మార్పు రావాలి.. విప్లవ బాటలో పయనించాలి. దేశంలో కొత్త పార్టీ రావద్దా? అవసరమైతే తెరాస జాతీయ పార్టీగా మారుతుంది. తెలంగాణలో మాదిరిగా గొప్ప ప్రాజెక్టు కట్టుకోలేమా? దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాలి అన్నారు కేసీఆర్.

బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ అడ్డదిడ్డంగా మాట్లాడటంతో విదేశీ రాయబారులు సమన్లు జారీ చేశారన్నారు కేసీఆర్. ఆమెపై మండిపడితే.. సుప్రీంకోర్టు జడ్జీలను కూడా లక్ష్యం చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జడ్జీలతో లేఖలు రాయిస్తారా? బలుపా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ దాటిందంటారా? అని ప్రశ్నించారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు దేశం క్షమాపణ చెప్పాలా? అని నిలదీశారు కేసీఆర్. జడ్జీలు పార్దీవాలా, సూర్యకాంత సాబ్‌లకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. గద్దార్, రాక్షసుల నుంచి దేశాన్ని కాపాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.