నేడు సిఎంలతో ప్రధాని మోడి భేటి

సిఎంల సలహా, సూచనలు స్వీకరించనున్న మోడి

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు మరోసారి రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెలాఖరుతో అన్ లాక్ 2.0 ముగియనున్న నేపథ్యంలో, తదుపరి దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై, మోడి చర్చించనున్నారు. కాగా అన్ లాక్ ను ప్రారంభించినప్పటి నుంచి దేశంలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో, తదుపరి ఏఏ రంగాలకు ఉపశమనం ఇవ్వాలన్న విషయమై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా, నేడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సీఎంలతోనే మోడి ప్రత్యేకంగా మాట్లాడతారని పీఎంఓ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తదితర సీనియర్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో అన్ లాక్ 2.0 సమయంలో కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకోనున్న సీఎం, వారి నుంచే సలహాలు, సూచనలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఏడవసారి. ఈ సమావేశం అనంతరం, ఆగస్టు 1 నుంచి అమలు చేయాల్సిన నిర్ణయాలపై ప్రధాని కీలక నిర్ణయాలను తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచడం, కంటెయిన్ మెంట్ జోన్లలో మరిన్ని ఆంక్షలు, ప్రజల్లో ఇంకా అవగాహన పెంచడం, రికవరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు… తదితర అంశాలతో పాటు చిత్ర పరిశ్రమకు ఊరటను ఇవ్వడం, జిమ్ లను తెరిపించడం వంటి అంశాలపైనా పీఎం చర్చిస్తారని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/