భూ పంచాయితి..శివసేన నాయకుడిపై బిజెపి ఎమ్మెల్యే కాల్పులు

BJP MLA Fire at Shiv Sena leader

ముంబయి: మహారాష్ట్రలో బిజెపి ఎమ్మెల్యే సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై కాల్పులు జరిపారు. దీంతో షిండే వర్గం నేత తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఓ స్థలానికి సంబంధించి కళ్యాణ్‌ ఈస్ట్‌ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్ , శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌ మధ్య వివాదం నడుస్తున్నది. దీంతో తమ మద్దతుదారులతో కలిసి ఇద్దరు నేతలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు వారిని థానేలోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం మహేశ్‌ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాగా, కాల్పులకు పాల్పడిన ఎమ్మెల్యే గణ్‌పత్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతనివద్ద తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. బిజెపి ఎమ్మెల్యే పోలీస్‌ స్టేషన్‌లో కాల్పులకు పాల్పడ్డారని డీసీపీ సుధాకర్‌ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.