మరణించిన కొడుకు ఆస్తికి తల్లే వారసురాలుః కర్ణాటక హైకోర్టు తీర్పు

హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లే ఫస్ట్‌క్లాస్ వారసురాలు అవుతుందని హైకోర్టు స్పష్టీకరణ

Hindu Succession Act: Mother can claim share in deceased son’s ancestral property, says Karnataka HC

బెంగళూరు: ఉమ్మడి కుటుంబంలో మరణించిన కుమారుడి ఆస్తికి ఆమె తల్లి క్లాస్-1 వారసురాలిగా మారుతుందని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. టీఎన్ సుశీలమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ హెచ్‌పీ సందేశ్.. మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కులు ఉండవంటూ చిక్కమగళూరు జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేశారు.

మరణించిన కుమారుడి ఆస్తికి తల్లి ఫస్ట్ క్లాస్ వారసురాలు అవుతుందని తీర్పులో పేర్కొన్నారు. కేసు విచారణ సందర్భంగా ప్రతివాదుల తరపు న్యాయవాది సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించారు. పిత్రార్జిత ఆస్తిలో ఆమెకు వాటా కేటాయించే సమయానికే సుశీలమ్మ కుమారుడు మరణించాడని, కాబట్టి సెషన్స్ కోర్టు ఆదేశాలను సవరించాల్సిన అవసరం లేదని వాదించారు.

ఈ వాదనలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మరణించిన కుమారుడు సంతోష్ ఆస్తికి ఆమె ఫస్ట్ క్లాస్ వారసురాలు అవుతుందని స్పష్టం చేసింది. సంతోష్‌కు తల్లి, భార్య, కుమారుడు ఉన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబంలో సుశీలమ్మే ఫస్ట్ క్లాస్ వారసురాలు అవుతుందని, కాబట్టి సంతోష్ ఆస్తిలో అసలు అప్పీలుదారైన సుశీలమ్మకు వాటా దక్కుతుందని పేర్కొంది. సెషన్స్ కోర్టు తీర్పు లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ దానిని కొట్టివేసింది.