వంగపల్లి సభలో కేసీఆర్ ఫై నిప్పులు చెరిగిన బిజెపి నేతలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్బంగా యాదాద్రి జిల్లా వంగపల్లిలో బిజెపి భారీ బహిరంగ సభ ఏర్పటు చేసారు. ఈ సభ కు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. అలాగే కేంద్ర బిజెపి మంత్రి కిషన్ రెడ్డి , హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , డీకే అరుణ తదితరులు హాజరయ్యారు.

ఈ భారీ బహిరంగ సభలో నేతలంతా కేసీఆర్ ఫై , టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్… ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. దళితుడైన రాంనాథ్ కోవింద్ తోపాటు గిరిజన మహిళైన ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కుటుంబహితమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని..అవినీతి పరులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.

బండి సంజయ్ మాట్లాడుతూ..ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతుండని అన్నారు. లక్ష్మీ నరసింహ స్వామిని ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తన గతి ఏమవుతుందోనని ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నాడని అన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో ఢిల్లీకి పోతే షెడ్యూల్ ఉండదా అని ప్రశ్నించిన బండి సంజయ్.. అసలు ఆయన ఎందుకు హస్తినకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ఫ్రీ యూరియా ఇస్తానని పాలాభిషేకం చేయించుకున్న ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి జనం చేతికి చిప్ప ఇచ్చిండని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అగ్రకులాల పేదలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.

కేసీఆర్ సర్కార్ మాటలే తప్ప చేతల ప్రభుత్వం కాదని, అక్రమాలకు, అత్యాచారాలకు, దారుణాలకు ప్రతిరూపం ఈ ప్రభుత్వమని దుయ్యబట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార దుర్వినియోగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది తెలంగాణ సర్కార్ అని విమర్శించారు. ధర్మాన్ని, న్నాయాన్ని పక్కన పెట్టి నా రాజ్యం అంటూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే హామీలిచ్చి అనంతరం మరిచిపోతారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేశారో లెక్కలేదన్నారు. మజ్లిస్ పార్టీకి కీలుబొమ్మగా మారిందని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందుకే నిర్వహించడం లేదన్నారు.

కేసీఆర్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను మట్టికరిపించే అవకాశం హుజురాబాద్ ప్రజలకు దక్కిందని..ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని..అర్జునుడికి పక్షి కన్ను కనపడినట్టు, తమకు కేసీఆర్ ను గద్దె దించడమే కనపడుతోందన్నారు.