ఖమ్మంలో కలకలం.. బేజీపీ నాయకుడి దారుణ హత్య

ఖమ్మంలోని వైరా మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడిని దారుణంగా హత్య చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైరా మండల కేంద్రంలో బీజేపీ నాయకుడు నెలవెల్లి రామారావుపై కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామారావు మృతి చెందడటంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరికొన్ని రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడి హత్య జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రాజకీయ నాయకుడి హత్య జరగడంతో ఖమ్మంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని వారికి కఠన శిక్ష అమలయ్యేలా చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.