ఓటు వేయకుండానే వెనుదిరిగిన మిజోరం సిఎం జోరాంతంగ

Machine not working .. Mizoram CM Zoramthanga fails to cast vote in EVM malfunction

ఐజ్వాల్: మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఇవిఎం మొరాయించడంతో మిజోరం సిఎం వెనుదిరిగారు. దీంతో కొద్దిసేపు పోలింగ్‌ కేంద్రంలోనే వేచిచూసిన ఆయన.. మిషిన్‌ పనిచేయడం లేదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. టిఫిన్‌ చేసిన తర్వాత ఓటేసేందుకు మళ్లీ వస్తానని చెప్పారు. ఈవీఎం పనిచేయడం లేదని, దీంతో ఓటేయకుండానే తాను వెళ్లిపోతున్నాని మీడియాతో అన్నారు. ఈ ఎన్నికల్లో తాము పూర్తిస్థాయి మెజార్టీ సాధిస్తామని, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. హంగ్‌ వచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాలు అవసరమని, తమకు 25 సీట్లు వస్తాయన్నారు. రాష్ట్రంలో బీజేపీతో ఎలాంటి పొత్తూ లేదని స్పష్టం చేశారు. తాము కేంద్రంలోని ఎన్డీయేలో భాగంగా ఉన్నామని, రాష్ట్రంలో బిజెపితో ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్డీయేకు అంశాలవారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఐజ్వాల్‌లోని వైఎంఎ పోలింగ్ కేంద్రానికి జొరాంతంగా వచ్చారు. మిజోరం శాసన సభకు పోలింగ్ కొనసాగుతోంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

కాగా, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1 ట్రాన్స్‌జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.