రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల నియామకం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ

bjp-appoints-etela-as-state-election-organizing-committee-chairman

న్యూఢిల్లీః బిజెపి జాతీయ నాయకత్వం ఈరోజు పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చి, కొత్త నాయకుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పార్టీ హైకమాండ్ ఓ కీలక పదవి అప్పగించింది. ఈటలను బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటివరకు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాను బిజెపికి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని, ఓ కార్యకర్తగా కష్టపడి పనిచేస్తానని, ఎప్పటికీ మోడీనే నా నాయకుడు అని ఈటల స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించిందని తాజా నియామకం ద్వారా స్పష్టమవుతోంది.

కాగా, 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి అధినాయకత్వం ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి.

మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించిన బిజెపి అగ్రనాయకత్వం… మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త చీఫ్ లను ప్రకటించింది. ఝార్ఖండ్ బిజెపి అధ్యక్షుడిగా బాబూలాల్ మరాండీ, పంజాబ్ బిజెపి అధ్యక్షుడిగా సునీల్ జకడ్, రాజస్థాన్ బిజెపి చీఫ్ గా గజేంద్ర సింగ్ షెకావత్ లను నియమించింది. ఝార్ఖండ్ కు ఇప్పటివరకు దీపక్ ప్రకాశ్ బిజెపి స్టేట్ చీఫ్ గా వ్యవహరించగా, పంజాబ్ కు అశ్వని కుమార్ శర్మ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.