నేడు మణిపూర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ‘బీరేన్ సింగ్’

ఇంఫాల్: మణిపూర్‌లో శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత ఎన్ బీరెన్ సింగ్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో.. బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఆయననే సభానాయకుడిగా ఎంపికయ్యారు.
హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్‌చంద్ర సింగ్‌పై 18 వేల ఓట్లతో బీరెన్ సింగ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఐదోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై తిరుగుబాటు చేసిన బీరెన్ సింగ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/