తెలంగాణ కు మరో భారీ సంస్థ రాబోతుంది

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ఇంట్రస్ట్ చూపుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఏర్పటు జరుగగా..తాజాగా మరో పెద్ద సంస్థ తెలంగాణ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించి భారీ వాహ‌నాల త‌యారీ సంస్థ బిలిటీ ఎల‌క్ట్రిక్స్ త్రిచక్ర వాహ‌నాల త‌యారీ ప్లాంట్‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ కంపెనీ ప్ర‌తినిధి రాహుల్ గ‌యాం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ప్ర‌తి ఏడాది 2,40,000 ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ఉత్ప‌త్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కంపెనీని ప్రారంభించ‌బోతున్న‌ట్లు రాహుల్ తెలిపారు. అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ సంస్థ ఫిస్కర్‌.. హైదరాబాద్‌లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కంపెనీ స‌ర‌స‌న బిలిటీ ఎల‌క్ట్రిక్ కంపెనీ నిల‌వ‌నుంది. ఈ కొత్త ప్లాంట్‌లో 150 మిలియ‌న్ డాల‌ర్ల‌తో పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. దాదాపు 3 వేల‌కు పైగా ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. ఈ కంపెనీకి ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఉత్ప‌త్తి ప్లాంట్లు ఉన్నాయి. అమెజాన్, ఐకియా, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థ‌ల‌కు త‌మ వాహ‌నాల‌ను విక్ర‌యిస్తోంది.

ఇటీవ‌లి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేటీఆర్ ఈ సంస్థ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అందిస్తున్న ప్రోత్సాహ‌కాలు, తెలంగాణ‌లో ఉన్న పారిశ్రామిక అనుకూలత‌ల‌ను ఆయ‌న కంపెనీ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. కేటీఆర్ ప్ర‌జెంటేష‌న్‌పై లోతుగా ప‌రిశీలించిన బిలిటీ సంస్థ తెలంగాణ‌లో త‌న ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల క్రితం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల‌క్ట్రిక్ వెహికిల్ పాల‌సీని ప్రారంభించింద‌ని తెలిపారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్ప‌త్తికి తెలంగాణ‌ను గ‌మ్య‌స్థానంగా మార్చాల‌నే ఉద్దేశంతో ఈ పాల‌సీని ప్రారంభించిన‌ట్లు గుర్తు చేశారు. ఆ క‌ల సాకారం కాబోతుంద‌న్నారు. బిలిటీ కంపెనీ ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ – వీల‌ర్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించ‌బోతుంద‌న్నారు. ఈ ఏడాది బిలిటీ కంపెనీదే అతిపెద్ద పెట్టుబ‌డి అని కేటీఆర్ పేర్కొన్నారు.