అయ్యన్న ఇంటికి మరోసారి పోలీసులు

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటికి పోలీసులు వచ్చారు. చోడవరం మినీ మహానాడు సభలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో సెక్షన్ 41కింద నోటీసులు ఇవ్వడానికి గురువారం రాత్రి అయ్యన్న ఇంటికి విశాఖ సిటీ పోలీసులు వెళ్లారు. కానీ ఆ సమయంలో అయ్యన్న ఇంటివద్ద లేకపోవడం తో వెనుతిరిగారు. ఐదు రోజులు క్రితం గుంటూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజూ అయ్యన్న లేకపోవడంతో ఇలాగే వెనుతిరిగారు. ఇక ఇలా నోటీసులు ఇవ్వడం ఫై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్నపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని.. ఎలాగైనా అయ్యన్నను అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

మరోపక్క అయ్యన్న ఇంటిగోడ కూల్చడం ఫై హైకోర్టు ప్రభుత్వ అధికారుల ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చిన సంగతి తెలిసిందే. దీనిపట్ల అయ్యన్న కోర్ట్ ను ఆశ్రయించగా..ఇంటి ప్రహారీ గోడను నిర్మించుకునేందుకు అనుమతిచ్చింది. నోటీసులు ఇవ్వకుండా.. అక్రమంగా ఇంటి గోడను నర్సీపట్నం మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారని అయ్యన్న కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా గోడ కూల్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. గోడ కట్టుకునేందుకు అనుమతిచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.