ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్..

తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ మూడోసారి కూడా విజయం సాదిస్తుందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్మకం వ్యక్తం చేసారు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీటీసీ , జడ్పీటీసీ లు చేరగా..తాజాగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్‌తో పాటు జైనథ్ మండల జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు. ఇందుకు నేతలు హైదరాబాద్‌కు బయలుదేరగా పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇదే క్రమంలో ఆ పార్టీకి చెందిన ఇతర సంఘాల నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.