మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ!

Big Blow To Trinamool, 25,000 Bengal Teachers Fired, Told To Return Salary

కోల్‌కతాః మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల కోసం 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. దీంతో దాదాపు 25,753 మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల ప్రకారం… కేవలం ఉద్యోగాలు పోవడమే కాదు… ఇన్నాళ్లు వారు తీసుకున్న వేతనాలను కూడా 12 శాతం వడ్డీతో వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లను ఖాళీగా సమర్పించారని, తద్వారా చట్టవిరుద్ధంగా రిక్రూట్ అయ్యారని, కాబట్టి వారు తమ వేతనాలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని జస్టిస్ దేబాంగ్సు బసక్, జస్టిస్ ఎండీ షబ్బార్ రషిదితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉపాధ్యాయుల నుంచి వేతనాలను వెనక్కి తీసుకునే బాధ్యతను జిల్లా మెజిస్ట్రేట్‌లకు అప్పగించింది.

అయితే ఇలా ఉద్యోగాల్లో నియమితులైన వారిలో సోమదాస్ అనే ఒకరికి మాత్రం కోర్టు ఉపశమనం కల్పించింది. ఆయన క్యాన్సర్ చికిత్స పొందుతుండటంతో ఉద్యోగాన్ని కొనసాగించేలా ఉత్తర్వుల్లో మినహాయింపు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ధర్మాసనం, నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే కొత్తగా నియామక ప్రక్రియను ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(WBSSC)కు సూచించింది.

కాగా, ఈ ఉత్తర్వులను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల కేసులో విద్యాశాఖ మాజీ మంత్రి పార్థఛటర్జీ సహా పలువురు తృణమూల్ నేతలు, మాజీ అధికారులు జైలులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వులపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ… బీజేపీ నేతలు న్యాయవ్యవస్థను, తీర్పులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. 2016 టీచర్స్ రిక్రూట్మెంట్‌కు సంబంధించి హైకోర్టు వేలాది ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేసిందని, సీబీఐ ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చునని బెంగాల్ బీజేపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈసారి ఎన్నికల్లో మేనల్లుడు, అత్త (మమతా బెనర్జీ) ఓడిపోతారని పేర్కొంది.

కాగా, ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రస్థాయి సెలక్షన్ పరీక్షను నిర్వహించింది. 24,640 ఖాళీల భర్తీ కోసం 23 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. 25,753 మందికి ప్రభుత్వం అపాయింటుమెంట్ లెటర్లు ఇచ్చింది. అయితే నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దర్యాఫ్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ కోసం కలకత్తా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటయింది. దీనిని విచారించిన న్యాయస్థానం 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని… కాబట్టి నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది.