ఉప్పల్ తండ్రి కొడుకుల హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి

శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ లోని హనుమాన్ నగర్ లో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఉప్పల్‌ హనుమాన్‌ సాయినగర్‌కు చెందిన నర్సింహశర్మ, శ్రీనివాస్‌ లను అతి దారుణంగా హత్య చేసారు. శ్రీనివాస్‌ మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నెల రోజుల కిందటే మలేషియా నుంచి వచ్చాడు. కాగా శుక్రవారం ఉదయం గుర్తుతెలియని కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తండ్రి నర్సింహశర్మ, కొడుకు శ్రీనివాస్‌లను కత్తులతో కడుపులో పొడిచి అతి కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యను తమ బంధువులే చేశారంటూ కుటుంబ సభ్యులు అనుమానించారు.

ఈ కేసులో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. శంషాబాద్‌లో ఎనిమిది ఎకరాల భూ వివాదమే హత్యకు కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 30 మందిని విచారించిన పోలీసులు.. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా హత్యకు హంతకులు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గరు సభ్యుల సుపారీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల ఇంటి సమీపంలో హాస్టల్‌లో నిందితులు బస చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా దాడి చేశారు. హంతకులు 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్కులుగా గుర్తించారు. సిసిటీవీ కెమెరాలో రికార్డైన హత్యా దృష్యాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.