అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర

Bharat Jodo Yatra to enter Telangana on October 24

తెలంగాణ లో అక్టోబర్ 24 నుండి రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలుకాబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ లో పాదయాత్ర చేసిన రాహుల్..కర్ణాటకలోకి అడుగుపెట్టారు. శనివారం వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో రెండో రోజు పాదయాత్రకు బ్రేక్ పడింది. కర్ణాటకలో 22 రోజుల పాటు 511 కి.మీ మేర రాహుల్ పాదయాత్ర జరగనుంది. కర్ణాటక తర్వాత తెలంగాణలోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు.

అక్టోబర్ 24న రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరుకుంటుందని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆదివారం డీజేపీని కలిసి తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ను అందించి అనుమతి కోసం దరఖాస్తు చేస్తామన్నారు. అలాగే రాహుల్ పాదయాత్రకు జనాన్ని సమీకరించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. గతంలో అనుకున్నట్టుగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర 13 రోజుల పాటు సాగనుంది. రాహుల్ గాంధీ తెలంగాణలో మొత్తం 359 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 13 రోజులపాటు రోజు వారీగా రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనే నియోజకవర్గాల జాబితాను కూడా టీపిపిసి సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండలం కృష్ణ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలో కి ఎంట్రీ ఇవ్వనుంది.