నేటితో ముగియనున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో రాహుల్ ప్రారంభించారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 4 వేల కిలోమీటర్లకుపైగా రాహుల్‌ పాదయాత్ర సాగింది. నేడు సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న సభతో రాహుల్‌ ముగింపు పలుకనున్నారు.

జోడోయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు భావసారుప్యత కలిగిన 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఆహ్వానించింది. వీటిలో 12 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఉద్ధవ్‌ థాక్రే), సీపీఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేఎంఎం పార్టీల నేతలు సభకు హాజరవుతారని పేర్కొన్నాయి.