కొవాగ్జిన్ ఎగుమ‌తులు ప్రారంభం : భార‌త్ బ‌యోటెక్‌

హైదరాబాద్: హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ తాను త‌యారు చేసిన కొవాగ్జిన్ ఎగుమ‌తులు ప్రారంభించింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎగుమ‌తుల ఆర్డ‌ర్‌లను న‌వంబ‌ర్‌లో క్లియ‌ర్ చేస్తామ‌ని సంస్థ ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత నెల‌ల్లో కూడా ఎగుమ‌తులు కొన‌సాగుతాయని తెలిపింది. కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం పొందిన దేశాల జాబితా పెరుగుతున్న‌ద‌ని, డిసెంబ‌ర్ నెల‌లో ఇత‌ర దేశాల‌కు కూడా ఎగుమ‌తులు మొద‌ల‌వుతాయ‌ని భార‌త్ బ‌యోటెక్ తెలిపింది.

కొవాగ్జిన్ ఎగుమ‌తులకు అనుమ‌తులు ఇచ్చిన భార‌త ప్ర‌భుత్వానికి భార‌త్ బ‌యోటెక్ కృతజ్ఞ‌త‌లు చెప్పింది. క‌రోనా మ‌హ‌మ్మారిపై అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న పోరాటంలో ప్ర‌స్తుతం కొవాగ్జిన్ కీలకంగా మారింద‌ని ఫార్మా సంస్థ పేర్కొన్న‌ది. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 122.41 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని భార‌త ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/