భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి ..సాయంత్రానికి 30 అడుగుల చేరొచ్చు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరివరద ఉదృతి భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం 26 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి..సాయంత్రానికి 30 అడుగులకు చేరొచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. దీంతో 21 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం దగ్గర గోదావరిలో బ అంతకంతకూ పెరుగుతుంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 25.6 అడుగులకు చేరింది. సాయంత్రం వరకు గోదావరిలో వరద 30 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది.

మరోపక్క నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పొటేత్తింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 2,886 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే గేట్లను ఎత్తాలని అధికారులు చూస్తున్నారు. అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 18,261 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 32.27 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాణహిత నుంచి 2,58,530 క్యూసెక్కుల మేర లక్ష్మీ బ్యారేజ్‌కు ప్రవాహం కొనసాగుతుంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్‌ 35 గేట్లు ఎత్తి దాదాపు అదే స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి లక్ష్మీ బ్యారేజ్‌ వద్ద 10 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.