ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం అంటూ కేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు. రాష్ట్రంలో వెంటనే టీచర్ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన లేఖ రాసారు. వారంరోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని , లేదంటే నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడిస్తుందని హెచ్చరించారు.

గతంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వుందని… త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపిన విషయాన్నీ గుర్తు చేసారు. అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పి మూడేళ్లయ్యింది… ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని లేఖ ద్వారా సీఎంను కోరారు. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోతోందని… ఎక్కడ పరీక్ష రాయకుండానే అనర్హులుగా మిగిలిపోతామోనని లక్షలాదిమంది ఆందోళనకు గురవుతున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు లక్షలు ఖర్చుచేసి కోచింగ్ లు తీసుకుని… మరికొందరు ఏళ్లుగా ఖాళీగా వుంటూ ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేక లక్షలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్ అందకారంగా మారిపోతోందని… వారి కుటుంబాలను కూడా బాధిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు నెలలకోసారి టెట్, రెండేళ్లకోసారి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవారని… తెలంగాణలో ఏళ్లు గడుస్తున్నా డిఎస్సీ ఊసే లేదని అన్నారు.