నలుగురు అమాయక మహిళల ప్రాణాలు పోవడానికి తెలంగాణా సర్కారే కారణం – బండి సంజయ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ ఘటన ఫై ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నలుగురు అమాయక మహిళల ప్రాణాలు పోవడానికి ఈ తెలంగాణా సర్కారే కారణం అని నిప్పులు చెరిగారు.

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఈరోజు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఒక్కో కుటుంబానికి కోటిరూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారైనా బాధితుడి ఇంటికెళ్లారా? అని కేసీఆర్‌ని సూటిగా ప్రశ్నించారు. కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఉండేది ఆరోగ్యమంత్రి కాదు… అబద్ధాల శాఖామంత్రి అంటూ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రికార్డు కోసం ఒక్క గంటలోపు 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. నలుగురు మహిళల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలంతా రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించేవారని.. వీరందరి వయస్సు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదని బండి సంజయ్ అన్నారు. అందర్నీ ఒకే రూమ్‌లో వేసి గంటలోపు 34 మందికి ఎలా ఆపరేషన్ చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనికి వైద్యారోగ్యశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.