తెలంగాణలో బాణసంచాపై నిషేధం..ఉత్తర్వులు జారీ

తెలంగాణలో బాణసంచాపై నిషేధం..ఉత్తర్వులు జారీ
ts-govt-order-on-crackers-shop

హైదరాబాద్‌: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిరణయం తీసుకుంది. ప‌టాకుల దుకాణాలు త‌క్ష‌ణ‌మే మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, సీపీల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, సామాజిక కోణంలో భాగంగా పండుగలు చాలా ముఖ్యమైనవని, కానీ ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమైనవని హైకోర్టు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. పటాకులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ కొవిడ్‌ 19 వైరస్‌ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. పటాకులు కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ వ్యాధులున్న రోగులు, కొవిడ్‌ బాధితులు ఇబ్బందులు పడుతారని ధర్మాసనానికి నివేదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పటాకుల అమ్మకంపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తెరిచిన దుకాణాలను మూసేయాలని స్పష్టంచేసింది. ప్రజలు పటాకులు కాల్చకుండా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై వివరణ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/