ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న బండి సంజయ్ , తరుణ్ చుగ్

సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ దర్శించుకున్నారు. 20 కిలోల లడ్డూను బండి సంజయ్ గణపతికి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హిందూ సమాజ సంఘటిత శక్తి చాటేందుకే విగ్నేశ్వరుడి పూజలు చేస్తామన్నారు. హిందువులకు రోజుకో దేవుడు.. వారానికో పండగని అన్నారు. హిందువుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు. తెలంగాణలో హిందూ సమాజాం జాగృతం కావాలన్నారు.

ఇదిలా ఉంటె బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర..ఇప్పుడు నాల్గో విడతకు సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతలుగా యాత్ర చేపట్టి విజయం సాధించిన..సంజయ్ ఇక నాల్గో విడతకు సిద్ధమయ్యారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను ఖరారు చేసారు. ఈ నెల 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్న సంజయ్.. 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నట్లు పార్టీ తెలిపింది.

మొత్తం 10 రోజుల పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నందున ఆ రోజు పాదయాత్ర ఉండదు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్–కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.