సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్న పేదవారి ఉసురుగొట్టుకునే చర్య: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పింఛన్ల అంశం పై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆసరా పింఛన్ల వయో పరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్టు హామీ ఇచ్చారని, ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన 11 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు ప్రారంభించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కొత్తగా పింఛన్లకు అర్హులైన వారు ఏళ్ల తరబడి అధికార పార్టీ నేతలు, అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు.

కుటుంబంలో ఆసరా పింఛను పొందే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబంలో అర్హులు ఉంటే పింఛను కొనసాగించాలని, అలా కాకుండా ఒక కుటుంబానికి ఒక పింఛను అని నిర్ణయించడం అన్యాయం అని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్నవారి ఉసురుగొట్టుకునే చర్య అని బండి సంజయ్ విమర్శించారు. 2018 డిసెంబరులో ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని, దాంతో గడచిన 39 నెలల్లో ఒక్కో ఆసరా లబ్దిదారుడికి ప్రభుత్వం రూ.78,624 బకాయి పడిందని వివరించారు. ఆ బకాయిలను వృద్ధులకు చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/