పాదయాత్ర ముగింపు సభలో కన్నీరు పెట్టుకున్న బండి సంజయ్

బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. ఈ సందర్భాంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

ఈ ముగింపు సభలో మాట్లాడుతూ బండి సంజయ్ కన్నీరు పెట్టుకున్నారు. ” ఆత్మ అభిమానం చంపుకొని పనిచేయడం కష్టం. ధర్మం కోసం యుద్ధం చేస్తా. నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. అవమానాలకి భయపడే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం భూమి, గ్రానైట్, సాండ్ స్కాంలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ జగన్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను పక్కనబెట్టారని..బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని సంజయ్ అన్నారు.

నాకు టికెట్ ఇచ్చినప్పుడు డిపాజిట్ కూడా రాదని హేళన చేశారు. నా గెలుపుతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. కరీంనగర్ కార్యకర్తల వల్లే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. కరీంనగర్ లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోడీ, అమిత్ షా చెప్పారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇస్తామని తెలిపారు.ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు.