బిజెపి తెలంగాణ అధ్యక్షుడు మార్పు..స్పందించిన బండి

మోడీ సభకు అధ్యక్షుడిగా వస్తానో రానోనని కార్యకర్తలతో వ్యాఖ్య

bandi-sanjay-reaction-over-bjp-state-president-change

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ పార్టీ, సిఎం కెసిఆర్ పై నేరుగా విమర్శలు చేస్తూ.. ఎప్పుడూ హుషారుగా మాట్లాడే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త డీలా పడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా తనను తప్పిస్తారన్న వార్తలు, ఊహాగానాల నేపథ్యంలో వరంగల్‌ జిల్లా హన్మకొండలో పర్యటించిన సంజయ్ ముభావంగా కనిపించారు. ఈ నెల 8వ తేదీన వరంగల్‌లో జరిగే ప్రధాని మోడీ సభకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరౌతానో లేదోనని ఆయన కార్యకర్తలతో అన్నారు.

ప్రధాని మోడీ వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా కిషన్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి సంజయ్ ఏర్పాట్లను సమీక్షించారు. తన సహజశైలికి భిన్నంగా సంజయ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ పార్టీ రాష్ట్ర బాధ్యతల నుంచి తనను తప్పించినా అధైర్యపడవద్దని బండి సంజయ్‌ తనను అభిమానించే కార్యకర్తలు, నాయకులకు బండి నచ్చజెబుతున్నట్టు తెలుస్తోంది.