రెండోరోజు కొనసాగుతున్నబండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇమామ్ పూర్ నుంచి ఆలంపూర్ లోని ప్రొగటూరు వరకు యాత్ర కొనసాగనుంది. లింగన్ వాయి, బూడిదపాడు, ఉండవెల్లి, తక్కశిల, ప్రొగటూరు మీదుగా 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.ఇవాళ పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణ పాల్గొన్నారు.

బండి సంజయ్ రెండవ విడత చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 31రోజుల పాటు సాగనుంది. గురువారం ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే నెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పాదయాత్ర ముగుస్తుంది. ఈ పాదయాత్ర ఐదు జిల్లాలు 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో మొత్తం 387 కి.మీ దూరం సాగనున్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర.. గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు 13కి.మీ దూరం బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నం సమయాల్లో ఆయా ప్రాంతాల్లోని బీజేపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.