సిట్పై తనకు నమ్మకం లేదన్న బండి సంజయ్

TSPSC పేపర్ లీకేజ్ దర్యాప్తులో సిట్ ఫై తనకు నమ్మకం లేదని , అందుకే తన దగ్గర ఉన్న వివరాలు సిట్ కు అందచేయలేనని అంన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన దగ్గరున్న వివరాలను అందిస్తానని తేల్చి చెప్పారు. TSPSC పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తో TSPSC పలు పరీక్షలను రద్దు చేయడం తో పాటు గ్రూప్ 1 ను సైతం రద్దు చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఆగ్రహం తో రోడ్ల పైకి వచ్చి TSPSC ఫై అలాగే ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు సైతం ఆందోళన బాట పట్టాయి. ఇదిలా ఉంటె TSPSC ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. TSPSC పేపర్ లీకేజీ పై బండి సంజయ్ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు. మార్చి 24వ తేదీన సిట్ ఎదుట హాజరు కావాలని బండి సంజయ్ కు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు వెల్లడించారు.

పేపర్ లీకేజీ కుట్ర వెనుక మంత్రి కేటీఆర్ పిఏ హస్తం ఉందని, సిరిసిల్లలోనే ఎక్కువ మందికి గ్రూప్ వన్ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈరోజు సిట్ ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని బిజెపి పార్లమెంటరీ పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాలకు వెళ్ళాలన్న కారణంతో బండి సంజయ్ సిట్ విచారణకు హాజరుకావడం లేదని బీజేపీ వర్గాలు చెప్పుకొచ్చాయి.ప్రస్తుతం బండి సంజయ్‌ ఢిల్లీలో ఉన్నారు.

ఇదే క్రమంలో బండి సంజయ్ సిట్ కు లేఖ రాసారు. సిట్ను తాను విశ్వసించడం లేదని..సిట్పై తనకు నమ్మకం లేదన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్కు ఇవ్వదల్చుకోలేదని స్పష్టం చేశారు. నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన దగ్గరున్న వివరాలను అందిస్తానని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.