కేటీఆర్‌ ‘ట్విట్టర్‌ టిల్లు’ గా మారారని బండి సంజయ్ ఫైర్ ..

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..మరోసారి కేసీఆర్ , కేటీఆర్ ల ఫై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోగాలం దాపురించింది. విసునూరు దొర రామచంద్రారెడ్డి వారసుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు కేటీఆర్‌ ట్విట్టర్‌ టిల్లు లా మారారని సంజయ్ ఫైర్ అయ్యారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు బాణసంచాలు కాలుస్తూ ఘనస్వాగతం పలికాయి. అక్కడ స్వరాజ్‌ ఫౌండేషన్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతుండగా..ఒక్కసారిగా ఉద్రికత్త చోటుచేసుకుంది. టిఆర్ఎస్ , బిజెపి పార్టీల వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన వారితో పాటు సభకు వచ్చిన ఓ సాధారణ మహిళ సత్తెమ్మ.. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి లాఠీలకు పనిచెప్పారు. ఈ సంఘటన దేవరుప్పుల చౌరస్తా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ సంఘటనపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఫోన్‌ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడుతూ, వరంగల్‌ సీపీ.. మంత్రి దయాకర్‌రావుకు గుత్తేదారుగా తయారు కావడం వల్లే తమ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నా యని ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు శాంతియుతంగా యాత్ర చేస్తుంటే అడ్డుకుంటారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకుంటే.. మేము ఎండనకా, వాననకా పాదయాత్ర ఎందుకు చేస్తాం? సీఎంకు దమ్ముంటే పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లమనండి. నేను వెంటనే పాదయాత్రను ఆపేస్తా’అని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ అరాచక పాలన సాగిస్తున్నారన్నారని, ఆయనకు మందు మీదున్నంత ప్రేమ మంది మీదలేదని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోగాలం దాపురించింది. విసునూరు దొర రామచంద్రారెడ్డి వారసుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు కేటీఆర్‌ ట్విట్టర్‌ టిల్లు లా ఉన్నారు. ప్రజాసమస్యలపై పట్టింపు లేదు. సమస్యలపై ప్రశ్నిస్తే రైతులకు బేడీలు వేసి, జైలుకు పంపిస్తున్నారు. నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారు. హత్యలు చేయించేందుకు వెనుకాడటం లేదు. ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అందుకే కేసీఆర్‌ నిరంకుశ పాలనను బొందపెట్టటానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం’అని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఇక ఈరోజు తో బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర వెయ్యి కి.మీ. మైలురాయిని చేరుకోనుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా సమీపంలో ఈ ఘనతను సాదించనుంది.