ఈరోజు అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి ..నివాళ్లు అర్పించిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది

Atal Bihari Vajpayee death anniversary

నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి. ఈ సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్‌లో దివంగత నేతకు ప్రధాని, రాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా కౌట్ భట్టాచార్య తదితరులు సైతం వాజ్‌పేయి సమాధి వద్ద నివాళులు అర్పించారు.

అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళాడు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందాడు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనాడు.

వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేసాడు. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెసు ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించాడు.

భారతీయ జనతాపార్టీ, పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న వేర్పాటువాద తీవ్రవాదాన్ని వ్యతిరేకించినా, ఆ పరిస్థితికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యొక్క “విభజన, అవినీతి రాజకీయాలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఫణంగా పెట్టి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాయి” అని ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బ్లూ స్టార్ను వ్యతిరేకించింది. 1984 లో ఇద్దరు సిక్కు అంగరక్షకులచే ఇందిరాగాంధీ హత్యకు గురైన తదుపరి ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది. 1984 ఎన్నికలలో బి.జె.పి లోక్‌సభలో రెండు సీట్లను మాత్రమే పొందింది. ఆ కాలంలో వాజపేయి బి.జె.పి అధ్యక్షునిగా, విపక్ష నాయకునిగా కొనసాగాడు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కలసి చేపట్టిన రామ జన్మభూమి మందిర ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ గళాన్నిచ్చింది. 1995 మార్చిలో గుజరాత్, మహారాష్ట్రలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించింది. 1994లో కర్ణాటకలో జరిగిన అసెంభ్లీ ఎన్నికలలో మంచి విజయాలుసాధించింది. ఈ విధంగా జాతీయస్థాయిలో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 1995 నవంబరులో ముంబాయిలో జరిగిన బి.జె.పి సమావేశంలో బి.జె.పి అధ్యక్షుడైన లాల్ కృష్ణ అద్వానీ వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. 1996 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి విజయం సాధించింది. వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 ఆగస్టు 16 న సాయంత్రం 5:05 కు అటల్ బిహారీ వాజపేయి ఢిల్లీలో మరణించాడు.