ముంబై లో లాక్ డౌన్ తప్పదా..?

ముంబై లో కరోనా విలయతాండవం కొనసాగుతుంది. ప్రతి రోజు పదులు , వందలు కాదు వేలసంఖ్యలో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. ఈరోజు కూడా ముంబై నగరంలో కొత్తగా 20,318 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అంతే కాకుండా ఈరోజు ముంబై న‌గ‌రంలో క‌రోనా కాటుకు ఐదుగురు మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం ముంబై మ‌హా న‌గ‌రంలో 1,06,037 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక కరోనా కు సామాన్య ప్రజలే కాదు కరోనా నుండి ప్రజలను కాపాడాల్సిన డాక్టర్స్ సైతం కరోనా బారినపడుతున్నారు. మూడు వారాల్లోనే ఏకంగా 300 మందికి పైగా డాక్టర్స్ కు కరోనా సోకింది. ఇప్పటికే రాష్ట్రంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండగా, ఇప్పుడు ఉన్న కొంతమంది కూడా కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌కే పరిమితమైపోవడంతో రాష్ట్రంలో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడిన వైద్యుల సంఖ్య 308కి చేరింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రెసిడెన్స్‌ డాక్టర్లకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు, ఆస్పత్రుల సిబ్బందిలో కలకలం మొదలైంది.

ముంబై మ‌హా న‌గ‌రంలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డంలో నిర్ల‌క్ష్యం వహిస్తున్నారు కాబట్టే కేసులు పెరుగుతున్నాయని..ఇలాగే ప్రజలు నిర్ల‌క్ష్యంగా ఉంటె లాక్ డౌన్ పెట్టక తప్పదు అని హెచ్చరించారు. లాక్ డౌన్ విధిస్తే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందని.. లాక్ డౌన్ నుంచి త‌ప్పించుకోవాలంటే.. ప్ర‌జ‌లు త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా నిబంధ‌న‌లను పాటించాల‌ని సూచించారు. రాజేశ్ టోపీ చెప్పినదాన్ని బట్టి చూస్తే ముంబై లో లాక్ డౌన్ పెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.