హుజూరాబాద్ లో జరుగుతున్నది బైపోల్స్ కాదు

కేసీఆర్ బైయింగ్ పోల్స్: బండి సంజయ్

హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. ప్రగతి భవన్ ను కూల్చి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ ను లక్ష నాగళ్లతో దున్ని… ఆ భూములను బడుగువర్గాలకు పంచుతామని అన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే బలహీన వర్గాలకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామని చెప్పారు.

హుజూరాబాద్ లో జరుగుతున్నది బైపోల్స్ కాదని… కేసీఆర్ బైయింగ్ పోల్స్ అని సంజయ్ మండిపడ్డారు. ఓటర్లను లోబరుచుకునేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చేసినా బీజేపీ గెలుపును కేసీఆర్ అడ్డుకోలేరని అన్నారు. ఈటల బావమరిది చాటింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన నిజంగా తప్పు చేసినట్టైతే ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. గిరిజనుల పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/sports/