ఈ నెల 21 న అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరబోతున్న రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 21 న అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి..మీడియా సమావేశం ఏర్పటు చేసి తాను బిజెపి లో చేరబోయే తేదీని అధికారికంగా తెలిపారు. ఈ సందర్బంగా మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

నాలుగు పార్టీలు మారిన రేవంత్.. పార్టీ మారిన తన గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వ్యాపారం లేకుండా వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. కాంట్రాక్టులు తీసుకుని బీజేపీలో జాయిన్ అవుతున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తానని, నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

ఇక రాజగోపాల్ రెడ్డి రాజకీయ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి.. 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటి చేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆగస్టు 21 న బిజెపి లో చేరి..మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి తరుపున బరిలో దిగబోతున్నాడు.