ఎన్నికల్లో విచ్చలివిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటూ వివేక్‌పై బాల్క సుమన్ ఆరోపణ

బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయాలంటూ తెలంగాణ సీఈఓకు ఫిర్యాదు

balka-suman-comments-on-vivek

హైదరాబాద్ః చెన్నూరు నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌పై బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం వివేక్ కంపెనీ నుంచి కోట్ల రూపాయలను సూట్ కేసు కంపెనీకి బదిలీ చేశారని ఆరోపించారు. సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులని చెప్పారు. ఆ కంపెనీ రామగుండంలో వివేక్ ఇంటి అడ్రస్‌పై ఉందని కూడా పేర్కొన్నారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నందుకు సీఈఓకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఖాతాలు ఫ్రీజ్ చేయాలని కోరినట్టు మీడియాకు బాల్క సుమన్ వెల్లడించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బుల పంపిణీ జరుగుతోందని ఆరోపించారు.

అంగిలు మార్చినంత తేలిగ్గా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన రాజకీయాలు చేసే వ్యక్తి ప్రజాస్వామ్యానికి పీడ అని వ్యాఖ్యానించారు. వేల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తికి, వేల కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న వక్తికీ మధ్య పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు.