తారకరత్న కుటుంబ బాధ్యత తమదన్న బాలయ్య

నందమూరి తారకరత్న అకాలమరణం యావత్ సినీ , రాజకీయ ప్రముఖులను , అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. గుండెపోటుకు గురై , హాస్పటల్ లో చేరిన తారకరత్న..క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని అంత భావించారు. కానీ ఇలా పార్థివదేహంతో వస్తారని ఎవ్వరు ఊహించలేదు. తారకరత్న మరణం తో నందమూరి ఫ్యామిలీ శోకసంద్రం లో మునిగింది. తారకరత్న మరణం ఆయన భార్యను తీవ్రంగా కలచివేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి 39 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడటాన్ని అలేఖ్య రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. వైస్సార్సీపీ ఎంపీ , ఆమె పెదనాన్న అయిన విజయసాయి రెడ్డి అలేఖ్య ప్రస్తుత పరిస్థితి, తారకరత్న అంత్యక్రియల విషయమై మీడియాతో మాట్లాడారు.

“తారకరత్న మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను ఎంతో బాధించింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే తారకరత్న మరణించడం విచారించదగ్గ విషయం. రాజకీయాల్లో ప్రవేశించాలని తారకరత్న భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం. సినీ రంగంలో చిన్నా పెద్దా అని చూడకుండా అందరితో మంచిగా మెలిగిన అద్భుతమైన వ్యక్తి తారకరత్న. ప్రతి ఒక్కరినీ కూడా పేరు పేరునా అన్నయ్యా, అక్కయ్యా, చెల్లెమ్మా, మామయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచే మంచి వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోతారు.

తారకరత్నకు ముగ్గురు పిల్లలు. మొదట ఓ అమ్మాయి, తర్వాత కవలలు జన్మించారు. కవలల్లో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. తారకరత్నకు గుండెపోటు వచ్చాక బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చాలా శ్రద్ధ తీసుకున్నారు. బాలకృష్ణ అనేక పర్యాయాలు బెంగళూరులోని ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా అత్యుత్తమ చికిత్స అందించేలా కృషి చేశారు. అందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపు ఉదయం 9.03 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్ వద్దకు తరలిస్తున్నాం. బాలకృష్ణ గారు ముహూర్తం పెట్టిన విధంగా సాయంత్రం 3 గంటల తర్వాత మహాప్రస్థానం శ్మశానవాటికలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తారు” అని విజయసాయి వెల్లడించారు.

‘అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనైంది. ఆమె కాళ్లు చేతులు వణుకుతున్నాయి. కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. తను ఎంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం అంత తేలికైన విషయం కాదు. కొన్నాళ్లపాటు ఆమెకు ఈ ఒత్తిడి, ఒడుదొడుకులు ఉంటాయి. తారకరత్న ఫ్యామిలీ మా కుటుంబంలో ఒక భాగమని బాలకృష్ణ చెప్పారు. అలేఖ్యా రెడ్డిని, ఆమె పిల్లలను బాగోగులను తాము చూసుకుంటామని.. వారితో సత్సంబంధాలు ఉంటాయని చెప్పడం నిజంగా గొప్ప విషయం. బాలకృష్ణ గారికి తారకరత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుంది. దశదిన కర్మ ఎప్పుడు అనేది అంత్యక్రియల తర్వాత నిర్ణయిస్తారు’’ అని విజయసాయి రెడ్డి తెలిపారు.