100కి పైగా అంతర్జాతీయ అవార్డులను సాధించిన ‘బలగం’

బలగం ..ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి మనసులను ఆకట్టుకున్న చిత్రం ఇది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పడుతూ తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కర్ని పలకరించింది. దూరమైన బంధాలను దగ్గర చేసింది. ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చొని సినిమాలు చూసే ప్రస్తుత కాలంలో, ప్రజలంతా పల్లె నడిబొడ్డుకు చేరి ఒక్కచోట సినిమా చేసే పరిస్థితులను తీసుకొచ్చింది ఈ సినిమా. సున్నితమైన అంశాన్ని తీసుకొని హృద్యంగా తెరకెక్కించిన ఈ బలగం సినిమా కేవలం తెలంగాణ పల్లె ప్రజలను మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా ఉన్న ఆడియన్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

అందుకే ఒకటి , రెండు కాదు ఏకంగా 100 కు పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని వార్తల్లో నిలిచింది. బలగం సినిమాకు వందకిపైగా అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన మరుపురాని ప్రయాణం. ఇదివరకు మన సినిమాలు 100 రోజులు, 100 సెంటర్లు, 100 కోట్లు కలెక్ట్‌ చేయడం వంటి రికార్డులను క్రియేట్‌ చేశాయి. కానీ 100కి పైగా అంతర్జాతీయ అవార్డుల సాధించిన ఘనతను అందుకుని ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు వేణు యెల్దండి ట్వీట్‌ చేశారు.