మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే చిన్న వయసులో రోగాలు : హరీశ్ రావు

మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముంది వ్యాఖ్య

Harish Rao

హైదరాబాద్ : మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగానే చిన్న వయసులోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోందని… ఒకప్పుడు పెద్ద వయసులో మాత్రమే కనిపించిన ఈ క్యాన్సర్… ఇప్పుడు 30 – 40 ఏళ్ల వయసు వారిలో కూడా కనిపిస్తోందని చెప్పారు. ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ నెల సందర్భంగా నిర్వహించిన అవగాహన నడక, మారథాన్ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.