ప్రజాభవన్‌ ఎదుట ఆటోను తగలబెట్టిన డ్రైవర్‌..

హైదరాబాద్ లోని ప్రజా భవన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ తన ఆటో ను పెట్రోల్ పోసి తగలబెట్టడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తెలంగాణ లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అమలు చేసిన దగ్గరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల గిరాకీ బాగా తగ్గింది. ప్రతి రోజు వెయ్యి రూపాయిల వరకు సంపాదించే డ్రైవర్లు..ఫ్రీ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి కనీసం రూ.200 కు సంపాదించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైనా ఓ దారి చూపించాలంటూ వారంతా గత కొద్దీ రోజులుగా ఆందోళనలు , ధర్నాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం ప్రభుత్వ తీరుతో కడుపు తరుక్కుపోయిన ఓ ఆటో డ్రైవర్‌.. తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన బతుకు బండిని నడిపించే ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ఓ ఆటో డ్రైవర్‌.. తన ఆటోను తగులబెట్టాడు. అక్కడే ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సదరు ఆటో డ్రైవర్‌ను మహబూబ్‌నగర్‌కు చెందిన దేవ్లా (45)గా పోలీసులు గుర్తించారు.