చంద్రబాబు మళ్లీ సీఎం కావడం తథ్యం: అచ్చెన్నాయుడు

జగన్ కు పాలన చేతకావడంలేదు..అచ్చెన్నాయుడు


విశాఖ : ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైస్సార్సీపీ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు వైస్సార్సీపీ దరిద్రాన్ని తెచ్చి నెత్తినపెట్టుకున్నారని, అందుకే రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు. రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిన ఇలాంటి వేళ పరిస్థితులను చక్కదిద్దగలిగిన నేత చంద్రబాబు మాత్రమేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు వంటి సమర్థుడైన నేత ఇప్పుడెంతో అవసరం అని నొక్కిచెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని ఉద్ఘాటించారు.

పరిపాలన చేతకాని వ్యక్తి జగన్ అని, ఇప్పుడు రాయలసీమ థర్మల్ ప్లాంట్ మూసివేతకు వైస్సార్సీపీ సర్కారు సిద్ధమైందని ఆరోపించారు. మాయమాటలు చెప్పి అందరినీ మోసగించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. “గతంలో కాంట్రాక్టు కార్మికులను టీడీపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వారు అడిగినవి ఇచ్చాం. వాళ్లు టీడీపీ వైపే ఉంటారని భావించినా, పాదయాత్రలో జగన్ మాటలకు మోసపోయారు. ఉద్యోగుల విషయమూ అంతే! డీఏ ఇచ్చాం, హెచ్ఆర్ ఇచ్చాం… వైస్సార్సీపీ వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పిన మాటలు నమ్మారు. కానీ ఇంతవరకు సీపీఎస్ రద్దు చేయలేదు. కార్మికులు, ఉద్యోగులకు న్యాయం జరగాలంటే మళ్లీ టీడీపీ రావాలి” అని అచ్చెన్న స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/