ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

At least 17 dead in southern Pakistan bus fire

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్‌ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సుకు మంటలు అంటుకొని 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా వరద బాధితులని, దక్షిణ పాక్‌లోని ఇండ్లకు తిరిగి వస్తుండగా బస్సు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌ – సింధ్‌ పావిన్స్‌లోని జంషోరో నగరాలను కలిపే ఎం-9 మోటార్‌ వే వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్నది.

ఇప్పటి వరకు ప్రమాదంలో 17 మంది మృతి చెందారని, మరో 10 మంది గాయపడ్డారని పార్లమెంటరీ ఆరోగ్య కార్యదర్శి సిరాజ్‌ ఖాసిం సూమ్రో తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తున్నది. బస్సులో ఉన్న వారంతా వరద బాధితులని, మోటార్‌ వే నుంచి దాదు జిల్లాలోని ఇండ్లకు తిరిగి వెళ్తున్నారని జంషోరో జిల్లా కమిషనర్‌ ఆసిఫ్‌ జమీల్‌ తెలిపారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సింధ్‌ ప్రావిన్స్‌ వరదలకు ఎక్కువ దెబ్బతిన్న జిల్లాల్లో దాదు జిల్లా ఒకటి. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయని, తర్వాత మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధమైందని అధికారులు పేర్కొన్నారు. కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సులో నుంచి దూకారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/