ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు టీ కాంగ్రెస్ సిద్ధం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోంది. నేతల మధ్య విభేదాల వల్ల కార్య కర్తలు సైతం పార్టీ కి దూరం అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది. ఇలాగైతే రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అధిష్టానం భావిస్తుంది. ఈ తరుణంలో ఎలాగైనా పార్టీ కి పూర్వ వైభవం తీసుకరావాలని చూస్తుంది. ఈ క్రమంలో ప్రజల సమస్యలు, కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు టీ కాంగ్రెస్ సిద్దం కావాలని డిసైడ్ అయ్యింది.

శనివారం గాంధీభవన్ నుంచి జూమ్ మీటింగ్‌లో నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలతో మాట్లాడారు. పోడు భూములు, ధరణి పోర్టల్, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరసన దీక్ష చేపట్టాలని, అన్ని మండల కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టిన తర్వాత గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా ఈ కీలక సమావేశానికి టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. జూమ్ మీటింగ్‌లో సమావేశాలు ఏంటి? ఇది ఏమన్నా కంపెనీనా? అంటూ మీడియా ముందు మండిపడ్డారు. తనకు ఫోన్ చేసి సాయంత్రం జూమ్ మీటింగ్ ఉంటుందని చెప్పారని, తనకు చాలా కోపం వచ్చిందన్నారు.