భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..గాయపడిన ఆర్మీ జవాన్

శ్రీనగర్: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్‌లో ఉన్న నల్లా ప్రాంతంలో సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటేందుకు యత్నించారు. గుర్తించిన సైన్యం.. వారిపై కాల్పులు జరిపింది. ప్రతిగా వారు కాల్పులకు తెగబడటంతో ఓ సైనికుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు.
చికటి కమ్ముకోవడంతో ఎల్‌వోసీ దాటడానికి భారీ ఆయుధ సామాగ్రి కలిగిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నించారని చెప్పారు. అయితే సైన్యం వారిని అడ్డుకోవడంతో కాల్పులు జరిపారన్నారు. సైనికులు కాల్పులు జరపడంతో సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లోకి ముగ్గురు ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టిందని, ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టామని వెల్లడించారు.