దర్శి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం – APSRTC

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో APSRTC మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడినవారి వైద్య ఖర్చులు భరిస్తామని ఆర్టీసీ ఈడీ పేర్కొన్నారు.

పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. కాగా, పెళ్లి బృందం కాకినాడకు వెళ్లేందుకు ఆర్టీసీ ఇంద్ర బస్సును అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో, ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్టీసీ నష్టపరిహారం ప్రకటించింది.

ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.