దేశంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ కేసీఆర్ కీలక ప్రకటన

2024 సాధారణ ఎన్నికల తర్వాత ఢిల్లీలో రాబోయేది మన ప్రభుత్వమే అని ..దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం కేసీఆర్ నిజామాబాద్ సభలో కీలక ప్రకటన చేసారు. సోమవారం (సెప్టెంబర్ 5) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించి బిజెపి ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.

ప్రపంచంలో ఏ దేశానికి లేని వరం భారత్‌కు ఉంది. మనకు 83 కోట్ల ఎకరాల అనుకూలమైన భూభాగం ఉంది. ఇందులో సగానికి కంటే ఎక్కువ భూమి వ్యవసాయానికి అనుకూలం. బీజేపీ ఇంత జేశాం, అంత జేశాం అని డంబాచారం చెప్పడాలు తప్పితే.. మోడీ వచ్చాక కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిండ్రా? కొత్త ఫ్యాక్టరీ పెట్టిండ్రా? ఉన్నవి అమ్ముకునుడు తప్పితే..! మోడీ పాలనలో దేశంలో.. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, నిరోద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరూ సుఖంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అహంకారం, బలుపుతో, మదమెక్కిన విధానంతో గవర్నమెంట్‌ను పడగొడతాం అని మాట్లాడుతోంది..మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ పిడిగిలి బిగించాలని అని , దేశం కోసం తెలంగాణ గడ్డ నుంచి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 2024 తర్వాత కేంద్రంలో రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రకటించారు.