నేడు కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్స్‌లకు నియామక పత్రాలు అందజేత

Appointment papers will be handed over to newly selected staff nurses today

హైదరాబాద్ః కాంగ్రెస్‌ ప్రభుత్వఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్స్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నియామకపత్రాలు అందించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్టాఫ్‌నర్సులకు నియామక పత్రాలను అందచేయనున్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినా అనేక కారణాలతో స్టాఫ్‌నర్స్‌ల భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది.

ఇటీవల స్టాఫ్‌నర్స్‌ల మెరిట్ లిస్ట్ ప్రకటించిన సర్కారు నేడు స్టాఫ్‌నర్స్‌గా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనుంది. కొత్తగా నియామకమైన 7వేల మందికి పైగా స్టాఫ్‌నర్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా 26 వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు కేటాయించనునట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తద్వారా ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొంది. మొత్తం 7,094 మంది స్టాఫ్‌నర్సుల నియమకానికి ప్రకటన ఇవ్వగా 6,956 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కేటగిరీలో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదని వెల్లడించారు.