ఈ నెల 30న రైతు భరోసా నిధులు జమ

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 30 న 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా అందించే పెట్టుబడి నిధులు విడుదల చేయనున్నారు. పెట్టుబడి సాయం కింద గతేడాది 51.41 లక్షల మందికి రైతులకు సాయం చేశారు. ఈ ఏడాది 52.31 లక్షల మందికి సాయం చేయనున్నారు. వీరికి తొలివిడతగా 7,500 చొప్పున మొత్తం 3,934.25 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు.
వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలను అందిస్తున్నారు. వెబ్ ల్యాండ్ ఆధారంగా అర్హులైన రైతులకు ఈ సాయం అందిస్తున్నారు. కౌలుదారులకు కూడా ఈ డబ్బులు ఇస్తున్నారు. తొలి విడత మేలో, రెండో విడత అక్టోబర్‌లో మూడో విడత జనవరిలో ఇస్తున్నారు.
ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుకుంటున్న వారిలో భూ యజమానులు 50,19,187 మంది కాగా, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్లు 91,752 మంది, ఇంకో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల అకౌంట్‌లలో ఇందుకు సంబంధించిన డబ్బుల్ని జమ చేయనున్నారు.