వాట్సాప్‌తో జత కలిసిన ఏపీ డిజిటల్‌ కార్పోరేషన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (APDC)..ఇప్పుడు వాట్సాప్ తో చేతులు కలిపింది. ప్రజలకు మరింత వేగంగా ప్రభుత్వ సమాచారం అందించేందుకు గాను APDC ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంటర్‌నెట్‌ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతనూ గుర్తించిన వాట్సాప్‌ ఇండియా ఏపీడీసీ వాట్సాప్‌ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది.

ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చేపట్టి సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు.. ఈ విషయాలపై తప్పుడు సమాచారా వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్‌ సేవల మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది. ‘ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రగతిశీల అజెండాను రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య డిజిటల్ మాధ్యమాల ద్వారా వారధిలా ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు ఎంతో సాయపడుతుంది’ అని ఏపీడీసీ వైస్ చైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి అన్నారు.